వైఎస్ జగన్ నాయకత్వంలో పరిశ్రమలకు రాచబాట – ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు

రూ.50 కోట్ల లోపు పెట్టుబడులతో ఏర్పాటయ్యే  పరిశ్రమలకు భూమి పూజ, శంకుస్థాపన

తొలుత ఛైర్మన్ సొంత జిల్లా అనంతపురం జిల్లా నుంచి మొదలయ్యేలా షెడ్యూల్ ప్లాన్

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా  మరింత పురోగమిస్తోందని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటించనున్నట్లు స్పష్టం చేశారు. రూ.50 కోట్ల లోపు పెట్టుబడులతో ఏర్పాటవుతోన్న  పరిశ్రమలకు భూమి పూజ, శంకుస్థాపన చేసే దిశగా ఏపీఐఐసీ అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే మొదలు కానున్న ఛైర్మన్ పర్యటనలో భాగంగా తొలుత ఆయన సొంత జిల్లా నుంచే ప్రారంభించేందుకు షెడ్యూల్ ప్లాన్ చేయాలని ఛైర్మన్ ఆదేశించారు. ఛైర్మన్ అధ్యక్షతన మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో శుక్రవారం 235వ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రగతి దిశగా పలు కీలక నిర్ణయాలకు ఛైర్మన్ నేతృత్వంలోని బోర్డు డైరెక్టర్లు, వైస్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రమణ్యం జవ్వాది  ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ఛైర్మన్ సుబ్రమణ్యం జవ్వాది మాట్లాడుతూ గత మూడేళ్లలో ఏపీఐఐసీ సాధించిన పారిశ్రామికాభివృద్ధిని బోర్డు డైరెక్టర్లకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ను ఇండస్ట్రియల్ హబ్ గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. గత మూడేళ్ల కాలంలో కరోనా విపత్తు వచ్చినప్పటికీ 93 పారిశ్రామిక హబ్ ల ఏర్పాటు కోసం ఏపీఐఐసీ రూ.1708 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు.  మే 2019 నుంచి నేటి వరకూ ప్రస్తుత ప్రభుత్వం 8,616 ఎకరాల భూమిని ఏపీఐఐసీ సమీకరించిందని ఎండీ స్పష్టం చేశారు. గత మూడేళ్ల కాలంలోనే ఏపీఐఐసీ  2,450 ఎమ్ఎస్ఎమ్ఈలకు భూ కేటాయింపులు చేయడం  జరిగిందన్నారు. ఆ భూముల్లో 377 యూనిట్లలో అనుమతులు సైతం పూర్తి చేసుకుని ఉత్పత్తులను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. మొత్తంగా చూస్తే కేవలం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జరిగిన భూ కేటాయింపుల ద్వారా రూ.52,161 కోట్ల పెట్టుబడులు, 2,31,309 మందికి ఉపాధి అవకాశాలు  రానున్నాయని సుబ్రమణ్యం జవ్వాది పేర్కొన్నారు. వాటిలో  ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కుల్లోనే ఏర్పాటైన పరిశ్రమల ద్వారా రూ.8,461 పెట్టుబడులు వచ్చినట్లు వివరించారు.  ఏపీఐఐసీ మూడేళ్ల ప్రగతిని మీడియా ద్వారా ప్రజలకు చేరేలా బ్రాండింగ్ చేయాలని ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి ఆదేశించారు.

ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో 9 మంది డైరెక్టర్లు చిన్నారెడ్డివారి ప్రదీప్ రెడ్డి, మట్ట శైలజ, గంగాధర్ రెడ్డి, కె.చంద్రఓబుల రెడ్డి, రాయవరం శ్రీనివాసులు రెడ్డి, పి. ఝూన్సీ లక్ష్మీ, మర్రి గోవింద రాజ్, మువ్వా స్వాతి, మొల్లి అప్పారావు  హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ కార్యదర్శి సౌరభ్ గౌర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఏపీఐఐసీ కంపెనీ సెక్రటరీ శివారెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *