జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అసమర్థ ప్రభుత్వం. చంద్రబాబనాయుడు రాష్ట్ర అభివృద్ధిలో అగ్రగణ్యులు – అచ్చెన్నాయుడు టీడీపీ

అమరావతి శాసనసభ : విభజన చట్టంలో పొందుపరచినవాటిని సాధించుకోవడం ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. మూడున్నర సంవత్సరాల్లో అనేక సార్లు ఢిల్లీ వెళ్లారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అక్కడే నివాసం ఉంటున్నాడు.  కడపకు స్టీల్ ప్లాంట్ కావాలని విభజన చట్టంలో మీరే పెట్టారు. కోరిన విధంగా ఆంధ్రప్రదేశ్ కు స్టీల్ ప్లాంట్ ఇవ్వండని ఒక్కరోజైనా ఒక్క రెప్రజంటేషన్ అయినా ఇచ్చారా? కేంద్రానికి స్టీల్ ప్లాంట్ ఇవ్వమని అడగకుండా ఎదురు దాడి చేస్తున్నారు. ఈ విషయాలను అసెంబ్లీలో చెప్పాం. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఒక్క పరిశ్రమ తీసుకురాలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. సిగ్గు లేకుండా అసెంబ్లీలో పారిశ్రామిక విధానంపై చర్చ పెట్టారు. సమయం వృధాయే తప్ప దానివల్ల ఏమీ ఉపయోగంలేదు. ఈ మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు. కడప స్టీల్ ప్లాంట్ దేవుడెరుగు… విశాఖ స్టీల్ ప్లాంట్ అటకెక్కే పరిస్థితికి వచ్చింది. దీనికి జగన్, ఈ ప్రభుత్వమే కారణం. ఈ విషయాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పిట్టకథల మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి ఆవు తెల్లగా ఉండును, నాలుగు కాళ్లుండును, పాలిచ్చును అని ఆవు కథ చెబుతున్నారు. ఈ కథే ఈ మూడున్నర సంవత్సరాల నుంచి చెబుతున్నారు తప్ప ఈ మంచి కార్యక్రమం ఈ రాష్ట్రానికి చేశాం అని చెప్పే పరిస్థితి లేదు. ఆడలేనమ్మ మద్దెలో ఓడు అన్నట్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక కరోనా పైకి నెపం నెడుతున్నారు. అసమర్థులే ఇలాంటి నెపాలు పెడతారు. జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అసమర్థ ప్రభుత్వం. చంద్రబాబనాయుడు రాష్ట్ర అభివృద్ధిలో అగ్రగణ్యులు.

Leave a Reply

Your email address will not be published.